వరంగల్ ఆసిడ్ దాడి నిందితులను పోలీసులు అధికారికంగా శిక్షించక ముందే ఆంధ్రజ్యోతి లో ప్రముఖ జర్నలిస్టు అల్లం నారాయణ రాసిన వ్యాసం ఇది. హరించాల్సింది ఇటువంటి వ్యక్తులను కాదని అది ఇటువంటి విషసంస్కృతిని పెంచి పోషిస్తున్న వ్యవస్థనని ఆయన అంటున్నారు. సినిమాలూ, నేరాలు ఘోరాలు వంటి క్రైం సీరియళ్ల పాత్రను ఆయన ప్రశ్నిస్తున్నారు.
పుట్టెడు దుఃఖంతో…
-అల్లం నారాయణ
వికృత సంస్కృతులకు నీరాజనాలు అర్పిస్తున్న మన అల్పత్వంలో శీనుగాడి వైఫల్యం వుంది. గమనించగలమా! నిజమే ‘రూట్ కాజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ సొసైటీ’… అవును మన విలువల పతనంలో రేపటి శీనుగాడి బుర్రలో దయ్యం వుంది. దాన్ని చంపెయ్యాలి. కొంచెం దుఃఖంతో… వివశంతో… నిస్సహాయతతో… ఆక్రోశంతో కూడా…
స్వప్నిక ప్రపంచం కూలిపోయింది. రంగురంగుల స్వప్నంలాంటి ఆమె జీవితం హఠాత్తుగా మసక బారింది. కలత పడింది సమాజం. నువ్వూ, నేనూ, ప్రతి తల్లీతండ్రీ కన్ళీళ్లూ పెట్టారు. ఒకే ఒక్క శ్రీనివాస్‌గాడి బుర్రలో దూరిన విషనాగు దాడికి మొత్తం ప్రపంచమూ కళవెళపడింది. నిజమే. ‘మొదట్లోనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే.. ఇలా జరిగేదా? ఇప్పుడెంత బాధపడ్తున్నాను. అయినా నేను భయపడడం లేదు. నేనే తప్పూ చేయలేదు. దేవుడు నావైపే ఉన్నాడు. నాకు న్యాయం జరుగుతుంది’ అంటున్నది స్వప్నిక. ఆమె దేవుడిని నమ్ముకున్నది. బహుశా పౌరసమాజం ఇవ్వాల్సిన ఏ రక్షణా ఆమెకు సరిపోలేదేమో. రక్షణ వ్యవస్థ వైఫల్యం అతి పురాతన కథ. ఇక మిగిలింది దేవుడే.. చివరకి ఆమెను దేవుడూ కాపాడలేదు.
అంతెందుకు కార్గిల్ యుద్ధంలో శత్రు సైనికులను తరిమిన సైనికుడైన స్వప్నిక తండ్రీ ఆమెను కాపాడలేకపోయాడు. అతనిప్పుడు వలపోస్తున్నాడు. యుద్ధంలో దొరికిన న్యాయం కూడా శాంతి సమాజంలో ఆయనకు దొరకలేదు. కార్గిల్‌లో వీర జవాన్లని కీర్తించిన వాళ్లే ఆయనను ఓడించారు. అవునూ… అతి కిరాతకుడు శ్రీనివాస్ ఒక్కడే నిందితుడా! స్వప్నిక స్వప్నాలు చిదిమిన వాడు, ప్రణీత ‘ఇన్ఫోసిస్’ మిలియనీర్ కెరీర్ కలను భగ్నం చేసినవాడు ఆ ఒక్క కిరాతకుడేనా? ఇదంతా ఎక్కడ జరిగింది. వరంగల్‌లో. వరంగల్‌కు ఒకప్పుడు ఒక సంస్కృతి ఉండేది. ఒకప్పుడు అక్కడ జీవన సౌందర్యం తాలూకు సంస్కృ తి పరిఢవిల్లేది. అమ్మాయిలను గౌరవించే సంస్కృతి, సమాన ఫాయాలో గుర్తించే సంస్కృతి, ‘ఆకాశంలో సగం’గా కీర్తించే సంస్కృతీ ఉండేది. విషనాగుల పడగలమీద కాలేసి కోరలు పీకే భావితరం దూతలు ఒకప్పు డు వరంగల్‌ను శాసించినప్పుడు, అమ్మాయిల వంక చూడడానికే భయపడే ఒక కాలం ఉండేది.
అమ్మాయిల ను, స్త్రీలను గౌరవించడం ఒక సంస్కృతి. ఆ సంస్కృ తి ధ్వంసమైపోయింది. రౌడీలు, గుండాలు, లుంపెన్ లు గజగజవణికే ఒక కాలం ఇప్పుడు లేదు. ఆ సంస్కృ తి ధ్వంసం అయినాక వచ్చిందే విధ్వంసం సంస్కృతి. బహుశా అది సర్వ త్రా వ్యాపించి ఉన్నది. అందుకు కలతపడుతూనే, దుఃఖంతోనే, ఒకే ఒక్క ప్రశ్న. ఈ కిరాతక దాడికి బాధ్యుడు ఒక్కడేనా? నిందితుడు ఒక్క శ్రీనివాసేనా? నిందుతుడు ఒక్క మనోహరేనా?నిజమే ప్రణీత చెప్పినట్టు శ్రీనివాస్‌ను ఉరి తీయాల్సిందే. కాదు కాదు. స్వప్నిక, ప్రణీతలపైన ఎంత కిరాతకంగా యాసిడ్ పోశాడో? అంతే కిరాతకంగా వాణ్నీ యాసిడ్ పోసి, హింసించి చంపాలి. నిజమే అలాంటి వాన్ని ఒక్కసారి చంపకూడదు. వాడికి ఏ బాధా తెలియకుండా చంపకూడదు. అవును వాడిని అప్పగిస్తే ‘ఎన్‌కౌంటర్’ చెయ్యాలి. ఉరితీయాలి. ముక్కలు ముక్కలుగా నరకా లి. స్వప్నిక, ప్రణీతలు అనుభవిస్తున్న నరక సమానమై న బాధను, వేదననూ వాడు అనుభవించాలి.
అంతటితో ఒక శ్రీనివాస్ అంతమవుతాడు. తర్వాత. మనోహ ర్ తర్వాత శ్రీనివాస్. మధ్యలో ఐదేళ్లలో ఇరవై నాలుగు కేసులు. అమానుషంగా, అనాగరికంగా, కిరాతకంగా, మృగ సమానంగా అమ్మాయిలను చంపేసిన వాళ్లు, యాసిడ్ పోసిన వాళ్లు, బండరాయితో మోదినవాళ్లు. ఇది ఇంతటితో ఆగుతుందా? శ్రీనివాస్ బుర్రలో ఏ దయ్యం కూచున్నది. ఆ దయ్యాన్ని చూడమంటున్నా. ఆ దయ్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది. అదీ సమస్య. ఆ దయ్యం ఎక్కడిది? ఏది ధ్వంసమై, ఈ విధ్వంసం శ్రీనివాస్ గాడి బుర్రలో దూరింది. వాడొకడేనా? వాడొకడే అయితే ఇరవైనాలుగు కేసుల్లోనూ ఒక్కడే బా«ధ్యు డా? సినిమాల్లో హీరోలేం చేస్తారు. ప్రేమించమని వెంటపడని సినిమా ఉందా? అమ్మాయి అంటే, కాలేజీ అమ్మాయి అంటే, పక్కింటి అమ్మాయి అంటే ప్రేమించే వస్తువు తప్ప మరేమీ కాదనే.
ఆలోచనాధార ఎక్కడిది? అమ్మాయి అంటే ప్రేమించాలి. లేదా? ప్రేమించకపోతే ప్రతీకారం తీర్చుకోవాలి, వెంటపడాలి. వేధించాలి. ఒక్క సినిమానన్నా మినహాయించి చూపగలరా! అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలేని, ఒక్క టీవీ ‘షో’ చూపగలరా! అమ్మాయంటే ఆట వస్తువుగా, ఆస్తిగా, హక్కు భుక్తంగా భావించని ఒక్క కథనాన్ని చూపగల రా! నట్టింట నడయాడే ఈ విషనాగుల గురించి మాట్లాడగలరా! ‘టెన్త్‌క్లాస్’ విజయం పునాదుల మీద ఇప్పుడు ‘వేసవి సెలవుల్లో’ సినిమాకు ప్రణాళిక వేస్తున్న వారి బుర్రలో దయ్యాన్ని గురించి ఏం చెయ్యాలి! టెన్త్‌క్లాస్‌లో ప్రేమ, లేచిపో.. హింస ఆ తర్వాత వేసవి సెలవుల్లో ప్రేమ. అక్కడా ఖాళీ కూడదు. హీరోయిన్‌ను కిడ్నాప్ చేసిన వాడే హీరో. హీరోయిన్ ప్రేమించక పోతే శాడి జం ప్రదర్శించిన వాడే హీరో.
ఎక్కడ తప్పించుకోగలం ఈ దయ్యాన్ని. నేరాలు-ఘోరాలు, నటీనటులతో సహా, ఎలా చంపాలి! ఎలా ఉరిపోయ్యాలి చూపుతున్నప్పుడు, కళ్లప్పగించి చూస్తున్న వాళ్ల మెదడులో ఏ పురుగుమెసలుతుం దో? ఎప్పుడైనా ఆలోచించగలమా? నిజమే. ఇంటర్‌లో ప్రేమ, క్లాస్ రూమ్‌లో కడుపు.. ఎవరన్నా ఈ వి’చిత్రాన్ని’ అది నిర్మించిన పెద్దమనిషిని, తీసిన కళాకారున్ని ఎప్పుడైనా ప్రశ్నించారా? శ్రీనివాస్ గాడి బుర్రలో ఎన్ని దయ్యాలు దూరాయో…. ఆ దయ్యాలకు ఒక అండ కూడా వుంది. వాడి తండ్రి బిల్డర్. వాడికి పోలీసుల నుంచి రక్షణ వుంది. లేదా! పోలీసులు ఒక కార్గిల్ వీరుని ఫిర్యాదుకన్నా, ఒక బిల్డర్ లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే క్షీణ విలువలలో ఉండి ఉండవచ్చు. విలువలెక్కడివి? ఒక్క పద్యం చదవమనో? మంచి పుస్తకం చదవమనో? శ్రీశ్రీ మహాప్రస్థానం చదవాలనో? యువతకు ఎవరు చెప్పాలి! చెప్పగలమా? శ్రీనివాస్ గాడే కాదు… నీ కొడుకూ.. నా కొడుకు బుర్రలోకి ఏం వెళ్తున్నదో? గమనించే ఓపిక ఈ పౌర సమాజానికి వుందా? చదువు.
టీవీ, సినిమా, వీధి, మాల్, ఊరిస్తున్నది. అంగాంగ ప్రదర్శన చేస్తున్నది. సంపాదించు, ఖర్చుపెట్టు, లెటజ్ ఎంజాయ్. డబ్బుంటే అమ్మాయి కూడా ప్రేమించాలి. పబ్‌లు, బార్లు, అలంకరించిన వీధులు, బుర్రలో విషనాగులు దూరుతున్నాయి. సమా జ హితం కోసం పోటెత్తిన వీధులిప్పుడు, రంగుల వల లు విసిరే అంగడి బజార్‌లను తలపిస్తున్నాయి. అదీ సమస్య. క్షీణ విలువలు ఒక సమస్య. రాజకీయాలు ఒక సమ స్య. ఆ రాజకీయాలు పట్టించుకోని ఒక అసహజ పరిణామాల సమాజం ఒక సమస్య. వ్యవస్థల వైఫల్యాలు, సంస్కృతీ వైఫల్యాలు వెరసి శీనుగాడి బుర్రలో దయ్యం దూరింది.
బహుశా ఈ శీనుగాడి బుర్రలో దయ్యం రేపు మరొక ‘మృగాడి’లో దూరుతుంది. ప్రత్యామ్నాయాలను ఎదగనీయకుండా, ప్రోది చెయ్యకుండా, సంస్కృతులను విచ్ఛిన్నం చేసి, వాటి స్థానం లో వికృత సంస్కృతులకు నీరాజనాలు అర్పిస్తున్న మన అల్పత్వంలో శీనుగాడి వైఫ ల్యం వుంది. గమనించగలమా! నిజమే ‘రూట్ కాజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ సొసై టీ’… అవును మన విలువల పతనంలో రేపటి శీనుగాడి బుర్రలో దయ్యం వుంది. దాన్ని చంపెయ్యా లి. కొంచెం దుఃఖంతో… వివశంతో… నిస్సహాయతతో… ఆక్రోశంతో కూడా….
Courtesy: Andhrajyothy